నీకు నేనే దొరికానా
నీప్రతాపం చూపడానికి
నిను నీవు నిరూపించుకోడానికి
ఆరాటాలు లేని ఆనందలోకంలో నేనుంటే
మధువు నంటూ మధురమంటూ
యదలోకి చాప కింద నీరు లా
మెల్లి గా తేలికగా అలా అలా అలవోకగా
ఎప్పుడొచ్చి నన్ను మంత్రించావో తెలీనంతగా
నీ ఆగమనం సమస్త ఆలోచనల నిష్క్రమణం
ఒకేసారి లిప్త కాలం లో జరిగినట్టు గా
అందినదే ఇష్టపడి ప్రేమించేనాకు
ఇష్టాలు ఉంటాయని తెలియజూపి
నీ గాఢ పరిష్వంగనలో నను నిలిపి
ఉక్కిరి బిక్కిరి చేయ
నేనే దొరికానా నీకు
నీ ప్రతాపం చూపెట్టడానికి
బాగుంది హాయిగా మత్తుగా అనుకునేలోపు
వాస్తవ ప్రపంచ వీక్షణం ,మానసిక కల్లోలం !
నే చేస్తోంది తప్పేమోననే అపరాధభావన
అసలు నేనేమి చేసానని మనసు అరణ్యరోదన!
మలిసంధ్యలో ప్రేమ అరుణిమ
పెదాలపై విరబూస్తుంటే
అనాది ఆచారాలు సాంఘిక కట్టుబాట్లు
పనిగట్టుకొని మరీ ఒక్కసారిగా కుదిపేస్తుంటే
ఇప్పుడిది అవసరమా
నీకు భావ్యమా
పరి పరి విధాల ప్రశ్నలు
అంతులేని ఆలోచనలు
నిర్ణీత వయసులోనే ప్రేమవికసించాలా
ప్రతి బందానికి నిర్దిష్టమైన పేరు ఉండాలా
కలిసి జీవిస్తేనే దానికి పరమార్థమా
మనోభావం తనుభావం తో ప్రవర్దిల్లాల్సిందేనా
నేను నా తనువు వేరు కాదా?
ఇలా ఏవేవో ప్రశ్నలు
వాటికి సమాధానం నే చెప్పలేక
నన్ను నే నిందించుకోలేక
నిన్నే అడుగుతున్నా
నేనే దొరికానా నీకు? ఓ ప్రేమా!
నీ ప్రతాపం చూపడానికి!
నిను నీవు నిరూపించుకోడానికి!
2 comments:
నవజీవన్ said...
మార్పు రావాలంటే ముందు మనిషి మార్పు వైపు పయనించాలి నేస్తం
విప్లవం ఒక మార్పు
జ్ఞాన సముపార్జన ఒక మార్పు
ఆచరణ ఒక మార్పు
మార్పు కోసం ఆత్రుత పడే ఓ మనిషి
మార్పు ప్రకృతి సహజ గుణం కదా !
జాన్‌హైడ్ కనుమూరి said...
http://premaantarangam.blogspot.in/2010/07/blog-post.html
పరిమళించిన పథాలలో
నడిచారో, పరుగెత్తారో, అలసిపోయారో
స్విచ్ వేయగానే గిర్రున తిరిగే ఫేనులా
కాలమేమి తిరగదు
ఒకరికొకరుగా ప్రీతిచేయడానికి
మనకు మనంగా శృతిచేయడానికి
మధ్య మధ్య ప్రవేశిస్తూనే వుంటుంది
వడిసి పట్టుకోవడం
మెలిపెట్టడం
సహనాన్నో బందాన్నో పరీక్షించడం
నడిపించడం పరుగులెత్తించడం
ఏడ్పించడం నవ్వించడం
దూరం చేయడం దగ్గరవ్వడం
కళ్ళలో కలలు నింపడం
దానికి వెన్నతో పెట్టిన విద్య
ఎవర్ని గెలిపిస్తుందో
ఎవర్ని ఓడిస్తుందో
బహుశ
తను అలసినప్పుడు
మరో జంటను వెతుకుతుంది
దాని వెతకడం ఆ జంట వంతౌతుంది.