గొంగళిపురుగు సీతాకొకచిలుకగా
మొక్క మహా వృక్షం గా
మనిషి మనీషి గా
మార్పు అంతటా ఉందేమో కదూ

మార్పు లేని చోటు ఏముందిలే
మారనిది ఈ జగంలో ఏముందిలే
మరి మార్పు సహజమే కదా!

ఆ మార్పులన్నీ మంచికేనా
మారనిదే మంచి జరగదా
పోనీ చెడు జరుగునేమోనని
ఏ మారుపైనా  ఆగిందా ఈ లోకం లో!

పుట్టిన నాటి నుండి పుడకలపై పడక వరకు
అన్నీ మార్పులే కదా
కొన్ని ప్రనాలికాబద్దమైతే 
 ప్రణాళికలకు రూపు నిచ్చేవి మరిన్ని 
అనుసందానమైనవి కొన్నైతే
అసంబద్దమయినవి కొన్ని
కానీ మారకుండా మిగిలినవి అసలు ఎన్ని ?

సో మార్పు ఒక్కటే శాశ్వతం కదా!
మారనిది నువ్వు నేను లేము కదా !

అయినా మరి  నాకు ఎందుకు ఈ అంతర్మదనం
ఏవేవో సమీకరణాలు ,సంజాయిషీలు
ఒప్పుకోలేకా? నేను మారలేకా?
మరి  ఎన్నిసార్లు మారాలి
కొలమానం, ఘనాంకం  లేదంటావేమో
కానీ ప్రతి అనుభంద ఆరంభానికి 
నేను మారుతూనే ఉన్నాను
నేను నేను గా ఉంటె ఏ భందం ఉండదా
నన్ను నన్ను గా ఉండనిచ్చే స్థితి అసలు లేదా
నేను నేనుగా ఎవ్వరికి ఇష్టం కాదా ?
ఏమో నాకోసం ఈ సారి నువ్వు మారుతావేమో?
 
అన్ని ప్రశ్నలే కదూ..........
ఈ ప్రశ్న జవాబు ఏ మలుపు లో ఉందొ
ఆ మలుపు ఏ మార్పు తేనుందో !!


నీకు నేనే దొరికానా
నీప్రతాపం చూపడానికి
నిను నీవు నిరూపించుకోడానికి     

ఆరాటాలు లేని ఆనందలోకంలో నేనుంటే
మధువు నంటూ మధురమంటూ 
యదలోకి చాప కింద నీరు లా
మెల్లి గా తేలికగా అలా అలా అలవోకగా
ఎప్పుడొచ్చి నన్ను మంత్రించావో తెలీనంతగా
నీ ఆగమనం సమస్త ఆలోచనల నిష్క్రమణం
ఒకేసారి లిప్త కాలం లో జరిగినట్టు గా


అందినదే ఇష్టపడి ప్రేమించేనాకు
ఇష్టాలు ఉంటాయని తెలియజూపి
నీ గాఢ  పరిష్వంగనలో నను నిలిపి
ఉక్కిరి బిక్కిరి చేయ 

నేనే దొరికానా నీకు
నీ ప్రతాపం చూపెట్టడానికి

బాగుంది హాయిగా మత్తుగా అనుకునేలోపు
వాస్తవ ప్రపంచ వీక్షణం ,మానసిక కల్లోలం !
నే చేస్తోంది తప్పేమోననే అపరాధభావన
అసలు నేనేమి చేసానని మనసు అరణ్యరోదన!

మలిసంధ్యలో ప్రేమ అరుణిమ
పెదాలపై విరబూస్తుంటే
అనాది ఆచారాలు సాంఘిక కట్టుబాట్లు
పనిగట్టుకొని మరీ ఒక్కసారిగా కుదిపేస్తుంటే

ఇప్పుడిది అవసరమా
నీకు భావ్యమా
పరి పరి విధాల ప్రశ్నలు
అంతులేని ఆలోచనలు

నిర్ణీత వయసులోనే ప్రేమవికసించాలా
ప్రతి బందానికి నిర్దిష్టమైన పేరు ఉండాలా 
కలిసి జీవిస్తేనే దానికి పరమార్థమా
మనోభావం తనుభావం తో ప్రవర్దిల్లాల్సిందేనా
నేను నా తనువు వేరు కాదా?

ఇలా ఏవేవో ప్రశ్నలు
వాటికి సమాధానం నే చెప్పలేక
నన్ను నే నిందించుకోలేక 
నిన్నే అడుగుతున్నా
నేనే దొరికానా నీకు? ఓ ప్రేమా!
నీ ప్రతాపం చూపడానికి!
నిను నీవు నిరూపించుకోడానికి!


గణితం, జీవితం
ఎంతవద్దన్నా  ఎందుకో
దగ్గరి  పోలిక పొంతన 

పాత సూత్రాలని ప్రశ్నిస్తూ
విలువల అస్తిత్వాన్ని నిగ్గదీస్తూ
కొత్త కోణాల్లో సవాలు విసురుతూ
నూతన పరిశోదనకు పునాదులు వేస్తూ
మూలవిలువ మారక పోయినా 
మల్లి మల్లి ఆలోచింపచేస్తూ
కొత్త కొత్త అభ్యాసాలు
కొంగొత్త సమీకరణాలు  

అనురాగపు భావకొలతలను
ఆత్మీయపు మధురిమలను
మనోస్థితి గతులతో బేరీజువేస్తూ
కొలతకు అందని అనుబంధాలని
ఒడిసి పట్ట ప్రయత్నిస్తూ గణిస్తూ 
అనుభూతి ని X లా భావిస్తూ
స్థితికనుగుణంగా విలువలు మార్చేస్తూ 
మరో కోణంలో ఇనుమడింపజేస్తూ
మార్పే శాశ్వతమని నిర్దారిస్తూ నిర్ణయిస్తూ
కొత్త కొత్త ఆలోచనా విప్లవాలు
జ్వలించే   అగ్నికణాలు  మన  హృదయాలు  


నువ్వు ...ఎంత బాగుంది నీ జ్ఞాపకం
నువ్వు ..ఎంత మధురం నీ భావన 

ఈ నువ్వు నేను చుట్టే లోకమంతా ఉన్నదా అన్నట్టు!
నువ్వు లేని ఈ లోకం నాకు బొత్తిగా  పరిచయం లేనట్టు!
నువ్వు రాక ముందు అసలు నాకు ఒక లోకమే లేనట్టు !
నీ తోనే నా ఆలోచనలు అన్నట్టు!
నీకోసమే నేను ఉన్నట్టు!

అంతా నా భ్రమే  అంటావా
మరి భ్రమయితే నా మొహం లో ఆ మెరుపేంటి ??
నీ ఊహ తో ఈ మైమరుపేంటి ??

నిజంగా నాకోసం నువ్వు కూడా ఆరాటపడుతున్నావా   
పోనీ లే ఎవడికి కావాలి నే బోడి ఆరాటం
నాకు నేను గా  ప్రేమిస్తే హాయి గా ఉంది
నువ్వు ఇలా ఉన్నావా లేదా అని ఆలోచిస్తే దిగులేస్తుంది

ప్రేమించు షరతులు లేకుండా
తన తో నిమిత్తం  లేకుండా
అసలు తనకి తెలియాల్సిన అవసరం లేకుండా 
ప్రేమించు పిచ్చి గా నీ పై నీకే అసూయ కలిగేలా 
అలా తన ఉహల ఒడిలో వాలిపోతూ..... 
తను ఊసుల వేడి లో కరిగిపొతూ..... 


అక్షరాలూ............
నన్నూ అల్లుకునే నేస్తాలు
హత్తుకునే ఆత్మీయ బందాలు
నా ఏకాంతపు వాకిళ్ళలో
విరబూసే సుమగంధాలు  !!

నన్నూ నేను నిర్వచిస్తే
చదివిన ప్రతీసారి 
నాకు నన్నూ కొత్త గా చూపిస్తూ
నా ఉనికి కి అర్థాలు చెపుతూ
నాలో వసిస్తూ
నాతో రమిస్తూ
నన్ను ఊరడిస్తూ
పలకరించే స్వాతి చినుకులు !!

అక్షరాలూ ...అవే గాని
ప్రతీ సారి కొత్త అర్థాలు ...కొంగొత్త అందాలు 


నిజం గా కనపడ్డావా
అబ్బే నా భ్రమేమో
యెహ్ కాదు లే
నీ కనుస్పర్శ తో
మేనిలో రేగే మదుర తరంగాలు 
ఇంకా నాలో చెలరేగుతున్నాయే!

స్పష్టం గా గుర్తు,నీ చిరునవ్వు లా 
నన్నూ నీవు కడసారి కలిసిన క్షణం
నా యద తరంగాలు 
నీ చూపుల ప్రశ్నలు
మళ్ళీ అవన్నీ  నన్నూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే
అది నువ్వు కాక మరెవరులే!
ఏమో నీ ఊహ కూడా నీలా ఘటికురాలేలే !

మళ్ళీ కలుస్తావనే ద్యాస లో ఏండ్లు  గడిచాయి నేస్తం
ఏ సందు మలుపు లోనో
ఏ పచారి కొట్టు లోనో
ఏ షాపింగ్ మాల్ లో నో
ఎలా ఉన్నావని నీ కనులు పలకరిస్తాయని
ఇంకా నా మనసు ఎదురు చూపు మానలేదు!

ఏ కాస్త అందం కనపడినా
 అది నువ్వే అనుకోని
తరచి తరచి చూస్తా
అందం ఉంది కానీ ఆ నిర్మలత్వం 
ఎక్కుడుంది చెప్పు నీలో తప్ప !

కానీ కనపడితే మాట్లాడుతావో
మొహం తిప్పుకొని అజ్ఞాత వ్యక్తి లా వెడలి పోతావో
మనసు లో అయినా నన్నూ ఎలా ఉన్నావు అని అడిగేసి 
కనులతో నన్నూ పలకరించి పోతావో
అసలు కనపడతావో ....  కనపడవో ....

ఒక్కసారి నిను చూడాలని ఉంది
మనసారా పలకరించాలని ఉంది
దూరం నుండి అయినా కనులతో నీ క్షేమం తెలుసుకోవాలని  ఉంది
ఎడారి లో ఒయాసిస్సు లా ఒక్క సారి కనిపించవు...


నా చిరునామా ఎవరిచ్చారో కాని 
జ్ఞాపకాల పుస్తకం వెంటేసుకొని
మది మరిచిన మమతల పెనవేసుకొని 
ఈ ఖాళి నన్నూ ఈ మధ్య ఏడిపిస్తుంది

అంతా ఒక్కసారిగా ఖాళి
గతం ఏది లేదన్నట్టు
ఉన్నది నాది కాదన్నట్టు
ఒక అపరిచిత వ్యక్తి లా 
నాకు నేనే ఒక ఖాళి లా

పనుల మార్పు నే విశ్రాంతి  నాకు
మరి ఏ క్షణాన  నేను దొరికానో
నన్నూ ఎలా ఒడిసి పట్టిందో తెలీదు కానీ
మరిచిపోయిన ఆశలని
సమాధి అయిన ఊసులని
మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ
నాలో నేను లేనా అంటూ ప్రశ్నిస్తూ
సతమతమయ్యేలా  చేస్తూ
సంబరపడుతుంది ఈ ఖాళీ

నీశిది నుండి సుప్రభాతం వరకు
నాతో నేను మమేకమై
ప్రశాంతమై  నిర్మలమై
ఆ నింగి లో ని చుక్కని
నా కంటిని తడిపిన చుక్కని
రెంటిని ఆస్వాదించే నన్నూ
ఎలా చేజిక్కిన్చుకుందో  మరి 
ఏమిటి నీ కథ?
చెప్పరాదా నీ  వ్యధ?
అని  అడుగుతూనే ఉంది ఆ ఖాళి

ఆ ఖాళీ ని సంపూరించ నీవు లేవని
నీవు లేని నేను ఒత్తి ఖాళి నని
ఎలా చెప్పను దానికి ?!
-నీ జ్ఞాపకాలలో నేను


యధాలాపంగా బస్సు కిటికీ బయటికి చూసాను
వేగం గా కదిలే వాహనాలు నేను కాదు 
అవే తరలి వెళ్తున్నాయా అన్నట్టు ప్రకృతి దృశ్యాలు
నింగి... నీలంగా.... నిర్మలం గా... 
ఒక పక్షి ఒంటరిగా ఎగురుతూ
ఆకాశపు హద్దుల్ని కొలుస్తుందా అన్నట్టు గా 

ఏకాకి లా అనిపించేది ఇంతకుమునుపు
ఇప్పుడది  కొత్తగా విశ్వం తో మమేకమైనట్టు
ఇచ్చాపూరితమై, స్వేచ్చా ఆచ్చాదితై 
హాయిగా తనతో తాను మమేకమై
తనదైన లోకంలో ఆనందవిహారం చేస్తున్నట్టుగా!

సాదృస్యత కనపడేది తనకి నాకు 
కాని ఇప్పుడెందుకో అదే పక్షి లో
నీవు కనిపిస్తున్నావు నాకు చిత్రంగా
కాదామరి!ప్రయత్నపూర్వకం గానో
అప్రయత్నం గానో ఈ సంధికాలం లో 
నలుగుతున్న మనం ..మన అనుభూతులు ...
  
సంతోషాల కోసం బంధాల సౌధాలను నిర్మించుకొని
వాటికే బంధీలమై వారధులకు బదులు
మనసులకు గోడలు కట్టుకొని
బయటికి రాలేక,వాటిల్లో ఇమడలేక
నువ్వూవేదన చెందుతున్నావని
మొహమాటపు ప్రేమలకు, అక్కర్లేని ఆదర్శాలకు 
నువ్వు బలిఅవుతున్నావని తెలిసి అనిపిస్తోంది 

అవును! నాపై జులిపించిన కొరడా 
నిన్ను కూడా కాలనాగై కబలిస్తుంది కదా  
మరి సహచర్యమా యుగ యుగాలుగా మనం 
కృషి చేసింది అనవసరపు ఆర్భాటాలకా ?
అసలైన ప్రేమ తత్వానికా ?

హ్మ్! ఈ రోజు ఆ పక్షి లో నువ్వు కనిపిస్తున్నావ్
బంధనం కాని ప్రేమల అన్వేషనకై
హాయిగా విహరిస్తూ స్వేచతో బస చేస్తూ
నది తీరాలను ఇసుక తిన్నలను
ఎడారిదారులను అన్నిటిని కలియదిరుగు
ఆ ఆకాశారాజం లో నాలాగే నువ్వు ప్రేమ పిపాసివై........


అవును! ఇక నేను లేను!
అనుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా
జీర్ణించుకోవడం కష్టం గా ఉన్నా
నిజం ఎప్పుడు అలానే ఉంటుందనే లా
ఒప్పుకోక తప్పట్లేదు ,ఇక నేను లేను!

ఇక నాకు ఏ బుజ్జగింపులు ఎందుకు?
ఏ సమాధానాలు ఎందుకు?
నిదురలేని రాత్రులు ఉండవు 
తడిసిన చెక్కిళ్ళు ఉండవు 
హాయిగా ఉంది ఒక్క సారి
మనస్పూర్తి గా ఒప్పుకున్నాకా!
అవును ! ఇక నేను లేను........ 

అనుకున్నది ఉంటేనేగా
 జరగలేదని ఏడవటానికి 
ఆ కోరికల వలయం లో
అవును! ఇక నేను లేను.......

నిరంతర శిల్పిలా ఆ విధాత
కాలమనే ఉలి తో నన్ను చెక్కుతుంటే
ఉన్నదే  శాశ్వతమనుకునే  భ్రమ లో
అవును! ఇక నేను లేను....... 

ఎందుకలానే ఉండాలనే ప్రశ్న ఉదయించాకా
ఏది నిస్వార్ధం గా ఉండదని తెలిసాకా
అంతరంగపు తుఫానులో దిక్కుతోచక 
అవును! ఇక నేను లేను......... 

కల్మషంలేని చిన్నారి  చిరునవ్వుకై 
నేను ఉంటె చాలు
నేను అనే నేనుని వదులుకున్నా 
ఫర్వాలేదు అని తెలిసాకా
నేను  అనే పరిధిలో
అవును! ఇక నేను లేను !


శరీరం తో ప్రాణం విడివడట్టు
పువ్వు తో పరిమళం తోడులేనట్టు
ఏదో లోటు,ఏదో వెలితి...
నవ్వొస్తోంది నేస్తం!
నువ్వు నన్ను వదిలి వెళ్ళినా
నేను ఇలా ఎలా ఉంటున్నట్టు??

జీవితమంటే గడిచినవో రోజునో .. రాబోవు రోజునో 
తలుస్తూ కలవరిస్తూ గడిపేయడమేనా...??
ఏదేదో  సాదిస్తూ నన్ను నేను కోల్పోవడేమేనా...??
ఆకాశాహర్మ్యాలను నిర్మించాను
భూగర్భజలాలను వెలికి తీసాను
సృష్టి కి ప్రతి సృష్టి చేసాను
ఏదేదో చేసాను నేనంటే నేనే అనిపించుకున్నాను
కాని నీఆలింగనంలో తెలుస్తుంది నా లా నేను లేనని  
జీవితపు పందెం లో నన్ను నేను ఓడానని
క్షణం క్షణం కోల్పోతూ రేపటికోసం పరితపిస్తూ
ఉన్నది ఆస్వాదించక,పోటి తత్వాలతో..
జీవించటం మరిచి ...బ్రతకటం నేర్చాను!

నాతో నేను మమేకమై చాన్నాలైంది
అక్షరాలలో నన్ను నేను పేర్చుకొని,
వర్ణమాలతో భావాలకు రంగులద్ది,
చాలారోజులైంది...  నేను నేనులా ఉండి!
నన్ను నేను పునర్నిర్మించుకుంటా ....
ఈ నవనాగరికత నీకు నాకు నడుమ 
అడ్డుగోడ  కాకుండా సరిచూసుకుంటా ... 
-ఎప్పటికి నీ నేను 


About Us